గీసుగొండలో గంజాయి గుట్టు రట్టు!
242 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ
కాకతీయ, గీసుగొండ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఎస్‌ఐ కె.కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా స్తంభంపల్లి ఏవీఎస్ హైస్కూల్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కవర్లు పట్టుకొని ఉన్న నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులను గమనించిన వెంటనే వారు పారిపోవడానికి యత్నించగా అదుపులోకి తీసుకుని తనిఖీ చేపట్టారు.
తనిఖీలో వారి వద్ద 242 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.14 వేలుగా అంచనా వేశారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో శశాంత్ గౌరి కిశోర్ @ శశాంత్, షేక్ మోసిన్, కోయల సందీప్‌గా గుర్తించగా, కిరణ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై మత్తు మరియు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.


