ఇండియన్ స్టూడెంట్స్‌కు కెనడా షాక్..!
(కాకతీయ, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల కలల గమ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్గం చాలా కఠినంగా మారింది. వలసల ప్రవాహాన్ని నియంత్రించేందుకు కెనడా ప్రభుత్వం ఇటీవల పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై గట్టిగా పడుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండు సంవత్సరాలుగా స్టూడెంట్ పర్మిట్‌ల జారీపై కోతలు కొనసాగుతుండటం దీనికి ప్రధాన కారణం.
తాజా గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. 2025 ఆగస్టులో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ నమోదైంది. 2023 ఇదే కాలంలో ఈ రేటు కేవలం 32 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అదే సమయంలో చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో కేవలం 24 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో ఆగస్టు నెలలో 40 శాతం మంది వీసా తిరస్కరణకు గురయ్యారని కెనడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
2023 ఆగస్టులో 20,900 మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2025 ఆగస్టులో ఆ సంఖ్య కేవలం 4,515కి పడిపోయింది. 1000 కంటే ఎక్కువ వీసా అప్లికేషన్లు ఉన్న దేశాల్లో భారత్‌కే అత్యధిక తిరస్కరణ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కెనడా విద్య కలతో ఉన్న వేలాది మంది విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. వీసా తిరస్కరణల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి మోసపూరిత లెటర్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్. 2023లో కెనడా అధికారులు దాదాపు 1,500 ఫేక్ లెటర్స్ గుర్తించారు. వాటిలో ఎక్కువ శాతం భారత్ నుంచే వచ్చినవని వెల్లడించారు.
తదుపరి ఏడాది తనిఖీలను మరింత కఠినతరం చేయడంతో 14,000 లెటర్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌లో మోసాలు బయటపడ్డాయి. కెనడాలోని విద్యాసంస్థలు విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఈ లెటర్‌ను ఇస్తాయి. దీనిని వీసా కోసం సమర్పించాలి. అయితే కొంతమంది మోసపూరిత లెటర్స్‌ను జత చేయడంతో తిరస్కరణలు పెరిగాయి. కాగా, భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణలపై కెనడా ప్రభుత్వం స్పందించింది. “భారత విద్యార్థులు ప్రతిభావంతులు, కెనడా ఆర్థికవ్యవస్థకు వారు గొప్పగా దోహదపడుతున్నారు. అయితే, వీసా మంజూరు లేదా తిరస్కరణ అనేది ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం” అని స్పష్టం చేసింది.


