- గంగాధర ప్రభుత్వ పాఠశాలలో దారుణ సంఘటన
- సోమవారం వెలుగులోకి ఘటన.. విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు


కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థినులు అనుమానాస్పద పరికరాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించగా గంగాధర ఎస్‌ఐ వంశీ కృష్ణ, సీఐ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కెమెరా పరికరాలను స్వాధీనం చేసుకుని పాఠశాల పరిసరాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం కొనసాగిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


