ప్రశాంతంగా పోలింగ్
ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 79.77% పోలింగ్ నమోదు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ గ్రామీణ పంచాయతీలతో పాటు పట్టణ శివార్లలో కూడా నాలుగు గంటల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఓటర్లు ప్రారంభం నుంచే కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపించినప్పటికీ పోలింగ్ సిబ్బంది సమన్వయం వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. తొలి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల నాలుగు జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 4 జిల్లాలో కలిపి 22 మండలాల్లో ఓటింగ్ నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ జరుగుతున్న ప్రధాన కేంద్రాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యక్షంగా సందర్శించి పోలింగ్ ఏర్పాటులను సమీక్షించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు గ్రామ స్థాయి బృందాలతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రత అంశాన్ని మరింత బలపరిచేందుకు పోలీసు శాఖ అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలీసు అధికారులు వ్యక్తిగతంగా కేంద్రాలను సందర్శించి భద్రత, జనసంచారం, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు.
జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు
తొలి విడతలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మొత్తం 22 మండలాల్లో పోలింగ్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో 5 మండలాలు అయిన చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొఠపల్లి రామడుగులో ఓటింగ్ నిర్వహించబడింది. మొత్తం 1,52,408 మంది ఓటర్లలో 1,24,088 మంది ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ 81.42%గా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన జిల్లాల్లో కరీంనగర్ ముందంజలో నిలిచింది. మహిళలు ఇక్కడ కూడా పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించారు.
జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లాలో తొలి విడతలో 7 మండలాలైన భీమారాం, ఇబ్రాహింపట్నం, కాతలాపూర్, కొరుట్ల, మల్లాపూర్, మెడిపల్లి, మెట్‌పల్లిలో పోలింగ్ జరిగింది. మొత్తం 2,18,194 మంది ఓటర్లలో 1,69,486 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.68% నమోదు కాగా మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడం ఈ జిల్లాలో ప్రత్యేకంగా నిలిచింది.
పెద్దపలి జిల్లా
పెద్దపల్లి జిల్లాలో తొలి విడతలో 5 మండలాలైన శ్రీరాంపూర్, కామేపూర్, రామగిరి, మంథని, ముత్తారంలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 1,43,856 మంది ఓటర్లలో 1,18,346 మంది ఓటు వేయగా జిల్లాలో పోలింగ్ శాతం 82.27% గా నమోదైంది. ముఖ్యంగా మంథని, కామేపూర్ మండలాల్లో ఉదయం నుంచే ఓటర్ల రద్దీ అధికంగా కనిపించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో చందుర్తి, కొనరాయిపేట్, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్ పోలింగ్ జరిగింది. మొత్తం 1,11,148 మంది ఓటర్లలో 87,339 మంది ఓటు వేసి 76.58% పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. వేములవాడ, కొనరాయిపేట్ మండలాల్లో పోలింగ్ శాతం ఇతర మండలాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 4 జిల్లాలో కలపి 6,25,606 మంది ఓటర్లలో 4,99,259 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలి విడత ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 79.77% గా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారుల నిరంతర పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అనుచిత పరిణామాలు చోటు చేసుకోకుండానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ పూర్తిస్థాయిలో ప్రశాంతంగా ముగిసింది.


