మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు
కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మద్దతు ధర 2400 రూపాయలు ఇవ్వాలి
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమిస్తాం
ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల ఆందోళన
కాకతీయ, ఖమ్మం : మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు 2400 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరాయి. సోమవారం వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, బొంతు రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు కేవలం 1400 నుంచి 1500 రూపాయలకే మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు క్వింటాకు 700 నుంచి 800 రూపాయల వరకు నష్టపోతున్నారని, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మార్కెఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


