ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు
భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక
భారీ యంత్రాలతో వాగులో తవ్వకాలు
మోతాదుకు మించి లోడింగ్‌తో రోడ్ల ధ్వంసం
రైతుల పంటలకు తీవ్ర నష్టం
అనుమానాలకు తావిస్తున్న అధికారుల మౌనం
కాకతీయ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అక్రమార్కులు భారీ మిషనరీల సహాయంతో వాగులో ఇసుకను తవ్వి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్విన ఇసుకను అతి భారీ వాహనాల్లో మోతాదుకు మించి లోడ్ చేసి ఆంధ్ర, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రవాణా రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే అధిక లోడింగ్‌తో భారీ వాహనాలు వెళ్లినా ఎవరూ ఆపకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ అక్రమ రవాణా వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజా రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రయాణాలు కూడా కష్టసాధ్యమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ముందు నుంచే రవాణా
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ ఇసుక రవాణా మార్గం స్థానిక పోలీస్ స్టేషన్ ముందుగా ఉండటం. ప్రతిరోజూ ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వస్తున్నప్పటికీ ఈ అక్రమ దందాపై చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగొచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక ర్యాంప్‌కు అనుమతులు ఇచ్చింది ఎవరు, ఈ అక్రమ దందా వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నదుల్లో తవ్వాల్సిన ఇసుకను వాగుల్లో తవ్వడం పర్యావరణానికి ముప్పుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాగుల్లో అనియంత్రితంగా తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక కిన్నెరసాని వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఇసుక రవాణా వల్ల ఎగిసే దుమ్ము పంటలపై పడుతూ దిగుబడులను ప్రభావితం చేస్తోందని వారు చెబుతున్నారు. పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక దందాను అడ్డుకోకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


