రైతు సమస్యలపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం
నాటి పదేళ్ల పాలనలో ధాన్యం తరుగును రైతులు మరవలేదు
అర్థం లేని, అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు
కాకతీయ, కరీంనగర్ : రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పై ఆధారంలేని ఆరోపణలు చేస్తుండటం దురదృష్టకరమని సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు అన్నారు. గంగాధర మండలం కురిక్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధాన్యం కొనుగోలు వ్యవస్థపై ఆరోపణలు చేసి రైతుల్లో అనవసర ఆందోళన సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే రైతులు అత్యధిక నష్టాలను ఎదుర్కొన్నారని, క్వింటాలుకు ఆరు కిలోల వరకు కటింగ్ చేసి రైతులను వేధించిన రోజులను ప్రజలు మరచిపోలేరని గుర్తు చేశారు. ఇక 20 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూసిన నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సత్యం కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆయన కృషితో రూ.23.50 కోట్ల పరిహారం మంజూరు కావడంతో నిర్వాసితుల ఇబ్బందులకు తెరపడిందని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకుని, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని బీఆర్ఎస్ నాయకులకు తిరుమలరావు పిలుపునిచ్చారు. సమావేశంలో మండల, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చన్న, తోట కరుణాకర్, గునుకొండ బాబు, రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, కర్ర బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


