హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట
పారిశ్రామిక వాడల్లో పర్యటనకు 8 నిజ నిర్దారణ బృందాలు
ప్రభుత్వ పాలసీతో కలిగే నష్టంపై ప్రజలకు వివరణ
నాయకులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్
ఇప్పటికే హిల్ట్ పాలసీపై బీజేపీ ఆందోళనలు
గవర్నర్‌ను కలిసి ఫిర్యాదుచేసిన నేతలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీతో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించనుంది. పారిశ్రామికవాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్దారణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. బుధ, గురువారాల్లో ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటింనున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తోపాటు బీజేపీ హిల్ట్ పాలసీపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద భూస్కాంకు రేవంత్ సర్కార్ తెరలేపిందని.. రూ. 5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైందని మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే బీజేపీ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదుచేయగా.. నేటి నుంచి బీఆర్ఎస్ పోరుబాట పట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

సీనియర్ నేతల ఆధ్వర్యంలో బృందాలు
గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని బీఆర్ఆ ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి సుమారు రూ.5లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని విమర్శలు చేస్తున్నాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం శ్మశానవాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని రెండు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈమేరకు సోమవారం బీజేపీ నేతలు గవర్నర్ కలిసి..హిల్ట్ పాలసి పేరుతో జరుగుతున్న భూ స్కాంను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఈ మేరకు మరో వైపు బీఆర్ ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవాడలను 8 క్లస్టర్లుగా విభజించి పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితోపాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించనున్నాయి.
పర్యటన వివరాలు
డిసెంబర్ 3, 4 తేదీల్లో హిల్ట్ పాలసీ స్కామ్‌పై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా.. క్లస్టర్-1లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలో మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనున్నారు.
క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
క్లస్టర్-3లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి నేతృత్వంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కూడిన బృందం మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడల్లో పర్యటించనున్నారు.
క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. క్లస్టర్-5లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్-6లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పటోళ్ల కార్తిక్ రెడ్డి.. కాటేదాన్, హయత్‌నగర్‌లో పర్యటిస్తారు. క్లస్టర్-8లో మాజీ మంత్రి మహ్మూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎండీ సలీం, చందులాల్‌తో కూడిన బృందం బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారు.


