కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో, రైతులు బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టారు. ఈ మూడు స్థానాలపై బీఆర్ఎస్ పోటీదారులు విజేతలుగా నిలవడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది.
ఈ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బలపర్చిన అభ్యర్థి కుంచాల ప్రవీణ్ రెడ్డి రైతుల మద్దతు పొందడంలో విఫలమయ్యారు. ఆయనకు కేవలం 9 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి 154 ఓట్లు, సందిల భాస్కర్ 240 ఓట్లు, కర్నాటి జయశ్రీ 172 ఓట్లు సాధించి డైరెక్టర్ స్థానాలను దక్కించుకున్నారు.
రైతుల తీర్పుతో బీఆర్ఎస్ అభ్యర్థుల త్రివిజయం సాధించడం, పార్టీకి స్థానికంగా బలాన్ని మరింత పెంచినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితాలు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


