కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ మూడు నెలలుగా జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు కష్టాలు పడుతున్నారని, రైతులు ఫర్టిలైజర్ షాపులు, సొసైటీ ఆఫీసులు చుట్టూ తిరిగినా యూరియా దొరకడం లేదని, కొందరు రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో నిలబడి నిరాశ చెందుతున్నారని తెలిపారు.
కలెక్టర్‌ను అభ్యర్థిస్తూ, రైతుల పంటలు దెబ్బతినకుండా అత్యవసరంగా యూరియా సరఫరా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం లైన్లలో గంటల తరబడి నిలబడి చివరికి ఖాళీ చేతులతో వెళ్లిపోతున్నారని వాపోయారు. ఈ పరిస్థితి వెంటనే సరిదిద్దకపోతే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోరిక గోవింద్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


