కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకున్న ఎరువుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా అసెంబ్లీని తమకు అనుకూలంగా నడిపిస్తుందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ అంశాన్నైనా సభలో పెట్టినా, తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం నుంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు ఏ విషయానికైనా సమాధానం ఇవ్వడానికి తాము వెనకడుగు వేయమని అన్నారు.
డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని కేటీఆర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని తనకు అనుకూలంగా నడిపించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రైతుల సమస్యలపై మాట్లాడకుండా, ముఖ్యంగా ఎరువుల కొరతపై దృష్టి పెట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “బీఆర్‌ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఎప్పుడూ రైతులు లైన్లలో నిలబడి ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు రైతులు ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో పెట్టి వర్షంలోనూ నిలబడాల్సి వస్తోంది” అని ఆయన ప్రశ్నించారు.
భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, ఇప్పటికే 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతులు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా, కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలులో వైఫల్యం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి, తమకు అనుకూలమైన రెండు మూడు విషయాలపైనే కాంగ్రెస్ మాట్లాడుతోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సహా అన్ని అంశాలపై సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. “అది పీసీ గోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ గోష్ కమిషన్ మాత్రమే” అంటూ ఆయన ఎగతాళి చేశారు. ఈ నిరసనతో బీఆర్‌ఎస్ రైతుల సమస్యలను మరింతగా ప్రాధాన్యం చేకూర్చుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.


