కాకతీయ, హుస్నాబాద్ : ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టి, ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. ఇటీవల కవిత హరీశ్‌రావుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, పార్టీ సీనియర్ నేతలను కించపరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
కవిత ప్రవర్తన బీజేపీ వైఖరిని ప్రతిబింబిస్తోందని, పార్టీ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ నేతలను అవమానపరిచే విధంగా ఎవరైనా వ్యవహరించినా సహించబోమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని అన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తును కాపాడేందుకు పార్టీపై తిరుగుబాటు స్వరాలు వినిపించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇకపై కవిత వ్యాఖ్యలపై ఏ మాత్రం సహనం ఉండబోదని హెచ్చరిస్తూ, పార్టీ ఐక్యతకు భంగం కలిగించే ప్రయత్నాలను తిప్పికొడతామని ప్రకటించారు.


