ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్
12వ వార్డులో కొన్రు త్రిలోక్ ఘన విజయం
మొదటి ఫలితంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
మొత్తం 24 వార్డుల్లో మెజారిటీ లక్ష్యంగా బీఆర్ఎస్
మూడో రౌండ్ల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
కాకతీయ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే తొలి ఫలితం వెలువడింది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొన్రు త్రిలోక్ విజయం సాధిస్తూ పార్టీ ఖాతా తెరిచారు. మొత్తం 656 ఓట్లలో త్రిలోక్ 316 ఓట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 216 ఓట్లు లభించగా, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి 19 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అమరేంద్రకు 4 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తొలి సీటును దక్కించుకుంది. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మొదటి ఫలితం బీఆర్ఎస్‌కు అనుకూలంగా రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రభావం ఉన్న ఈ వార్డులో ముందునుంచే బీఆర్ఎస్ గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు అంచనా వేశారు. అదే విధంగా తొలి ఫలితం కూడా ఆ అంచనాలను నిజం చేసింది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మెజారిటీ సాధించాలంటే కనీసం 13 వార్డులు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి విజయం సాధించడం బీఆర్ఎస్‌కు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, పార్టీ బలమైన కేడర్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మద్దతు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక మిగిలిన వార్డుల ఫలితాల కోసం అన్ని పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. తొలి ఫలితంతో బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు కూడా మిగిలిన వార్డుల్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఎవరు ఆధిపత్యం సాధిస్తారో తేలనుంది.


