విరిగిన ఇంజిన్ చక్రం
మడిపల్లి వద్ద ఇస్సార్ ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
రైల్వే అధికారుల సహాయక చర్యలు
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో ఇస్సార్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంతో గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు అదే మార్గంలో వస్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ను ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. రైలులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై రైల్వే అధికారులు మరింత పరిశీలన చేపట్టినట్లు సమాచారం.


