- సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించండి
- ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ ఈటల రాజేందర్
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్వ వైభవం తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేయించడం తన బాధ్యతగా తీసుకుంటానన్నారు. హుజురాబాద్ ప్రజలతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మంత్రి కాకముందే జమ్మికుంట బ్రిడ్జి, కమలాపూర్ విద్యా హబ్, అనేక సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశానని తెలిపారు.
అధికారంలో లేకపోయినా కూడా పనులు ఆగలేదని, ప్రభుత్వ పనులు ఎవరి జాగీరు కావు, ప్రజల హక్కులు మాత్రమే అని చెప్పారు. 2021 తర్వాత నిధులు ఆపిన మూర్ఖపు ప్రభుత్వం, మూర్ఖపు ముఖ్యమంత్రి వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కానీ నేను ఉన్నంత వరకూ హుజురాబాద్ అభివృద్ధి ఆగదు… హైదరాబాదులో ఉన్నా కూడా పాత పనులన్నీ పూర్తిచేస్తున్నాను అని రాజేందర్ పేర్కొన్నారు. దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ రావడానికి కారణం నేనే. దళితుల, పేదల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. డబ్బు, మద్యం రాజ్యం పోవాలంటే ధర్మానికి ఓటు వేయండంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో నాలుకలా ఉండే నాయకున్ని గెలిపించుకోండి అని పిలుపునిచ్చారు.


