గూగుల్ పేలో లంచం..
ఏసీబీకి చిక్కిన సిద్ధిపేట త్రీ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు
ఇసుక లారీలతో డీల్ బట్టబయలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక లారీ విడుదల కోసం లంచం డిమాండ్ చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకున్న ఎస్సై ఏసీబీకి చిక్కడం పోలీస్ వ్యవస్థలో కలకలం రేపింది. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్ధిపేట కమిషనరేట్‌లో త్రీ టౌన్లో ఎస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదుదారుడి ఇసుక లారీ విడుదల కోసం మొదట 20000 లంచం డిమాండ్ చేసిన ఆయన, తరువాత 15000కు తగ్గించి తీసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలో పోలీస్ కానిస్టేబుల్ బి సత్యనారాయణ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని లంచం స్వీకరించడం ద్వారా అధికార దుర్వినియోగం స్పష్టమైందని తెలిపారు. మార్చి 23, 2026న ఎస్సై వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అనంతరం కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.


