ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు
ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశాడంటూ వివాదం
ఫోన్ పే ద్వారా ఇరవై వేల రూపాయలు చెల్లింపు స్క్రీన్ షాట్లు వైరల్
మీడియా ముందు మాట్లాడిన దంపతుల అరెస్ట్
విడుదల చేయాలంటూ గ్రామస్తుల ఆగ్రహం
చిన్నగూడూరు ఘటనపై విచారణ డిమాండ్
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ఆరోపణలు రావడంతో మండలంలో చర్చనీయాంశమైంది. బాధితులు ఇప్పటికే ఇరవై వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు చెబుతున్నారు.
ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారంలో రూ.1లక్ష లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారంలో తలదూర్చి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్సై
దీనికి సంబంధించి రూ.20 వేలు ఫోన్ పే చేసి, రూ.80 వేలు మూడు రోజులో ఇస్తామన్న స్క్రీన్… pic.twitter.com/kEdVnwvh1e
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2026
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగిలిన ఎనభై వేల రూపాయలను మూడు రోజుల్లో చెల్లిస్తామని జరిగిన చర్చల వివరాలు కూడా బయటకు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనతో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అన్న అంశంపై అధికారికంగా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై మీడియా ముందు మాట్లాడేందుకు వెళ్లిన ఆంగోత్ బాలకృష్ణ, ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఘటనపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పడం నేరమా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసుల వ్యవహారంపై కూడా స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


