లంచగొండు పంచాయతీ కార్యదర్శి..
ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో లంచాల దందా..?
రాజాపూర్ కార్యదర్శిపై తీవ్ర ఆరోపణలు
-గ్రామస్తుల ఆవేదన
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని రాజాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్ల మంజూరు విషయంలో, అలాగే పింఛన్లు మంజూరు చేస్తానంటూ కార్యదర్శి మహబూబ్ పాషా వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పర్మిషన్లు ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆన్లైన్ లావాదేవీల రూపంలో పంపిన డబ్బుల వివరాలను కూడా వారు ఆధారాలుగా చూపిస్తున్నట్లు సమాచారం. గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడి ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తుండగా, ఈ తరహా వసూళ్లు వారికి అదనపు భారం మోపుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వని వారి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎంపీఓ కాసాగోని ప్రభాకర్ ప్రాథమిక విచారణ చేపట్టగా, పలువురు బాధితులు ఫోన్‌పే ద్వారా పంపిన డబ్బుల వివరాలను చూపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్తానని ఎంపీఓ చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


