స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.!
నాలుగు వారాల పాటు విచారణ వాయిదా
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో రెండో రోజు వాదనలు కొనసాగాయి. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే ఇచ్చి రేవంత్ సర్కారకు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టేందుకు 4 వారాలపాటు దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం గమనార్హం. అయితే రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ కేసు తదుపరి విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.


