కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లింది పార్లమెంట్. సోమవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభమవ్వగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనంటూ పట్టుబట్టాయి.
బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశాయి. స్పీకర్ సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి సద్దుమణగకపోవడంతో పార్లమెంట్ ఉభయ సభలను మధ్యాహ్నం 2గంటలకు వరకు వాయిదా వేశారు.
అటు ఓట్ల చోరీ జరుగుతుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నుంచి 300మందికిపైగా ఎంపీలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీల ర్యాలీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


