కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
రెండు రోజుల గాలింపు తర్వాత విషాదాంతం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంపేట్ గ్రామానికి చెందిన సాదుల అనిల్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతై మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. పొలం పనులు ముగించుకుని గ్రామ పరిధిలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో స్నానానికి వెళ్లిన అనిల్ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, రెండు రోజుల పాటు అనిల్ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సైదాపూర్ మండలం వెన్నంపల్లి పరిధిలోని ఎస్సారెస్పీ కాలువలో అనిల్ మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో కరీంపేట్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


