ఏవీవీలో రక్తికట్టించిన భాగవత పఠన పోటీలు
కాకతీయ, వరంగల్: స్థానిక ఏవీవీ జూనియర్ కళాశాలలో పాఠశాల స్థాయి విద్యార్థులకు పోతన భాగవత పద్య పటన పోటీలు ఆనంద ఉత్సాహల మధ్య వీనుల విందుగా జరిగినవి. సభా అధ్యక్షత వహించిన ఆచార్య ఎస్ఎస్ఎన్ శర్మ తాను బాల్యంలో 50 పోతన పద్యాలు నోటికి నేర్చుకొని అప్ప చెప్పే వారమని, ప్రతి వ్యక్తికి చిన్నప్పటినుండే భక్తి జ్ఞానం కలిగితే భవిష్యత్తు చాలా బాగా ఉంటుందని, దానికి పోతన భాగవతం ఎంతో తోడ్పడుతుందన్నారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చందా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 80 సంవత్సరాల నుండి ఈ ప్రాంగణంలో ఆచార్య చందా కాంతయ్య శ్రేష్టి ఆలోచనకు అనుగుణంగా ఈ పద్య పఠన పోటీలు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులలో భక్తిని కలిగిస్తూ విద్యార్థులు మంచి మార్గంలో నడుచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలంటే భాగవతం చదవాలన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. భుజేందర్ రెడ్డి మాట్లాడుతూ భాగవత పద్యాలు నేర్చుకొని అందులో భావాన్ని గ్రహించి మీరంతా మంచి విద్యలు నేర్చుకోవాలన్నారు. నిర్వాహకులు గందె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దక్షయజ్ఞం నుండి మీకు పద్యములు ఇచ్చామని వాటిని బాగా చదివి మీరు భగవంతుని కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ పోటీలో 34 పాఠశాలల నుండి 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు, పాలకవర్గ శాశ్వతసభ్యులు చందా శ్రీకాంత్, ఏవీవీ అధ్యాపక బృందం పాల్గొన్నారు.



