సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ
ప్రతీ ఇంటిని సోదా చేసిన పోలీసులు
డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిక్ వాడ ప్రాంతంలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్విర్ సింగ్ చందర్ సింగ్‌లపై కేసులు నమోదు చేసి సుమారు 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి అక్రమ పదార్థాలను గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ,అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.అలాగే గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా పరిరక్షణలో అవి కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేందర్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


