- యువత, మహిళలు, రైతులే లక్ష్యంగా పథకాలు
- మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులు రక్షిస్తాం
- రాష్ట్రంలో వక్ఫ్ చట్టం అమలును అడ్డుకుంటాం
- మేనిఫెస్టో విడుదల చేసిన మహాగఠ్‌బంధన్
- జోరందుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా మహాగఠ్‌బంధన్ కూటమి మంగళవారం పట్నాలో తమ ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. “తేజస్వి ప్రతిజ్ఞ ప్రాణ్” పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో- యువత, మహిళలు, రైతులు, పేదలపై వరాల జల్లు కురిపించారు. పట్నాలోని ఓ ప్రముఖ హోటల్లో మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదల చేశారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా మహాగఠ్‌బంధన్ కూటమిలోని ప్రముఖ నేతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఐపీ నుంచి ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ నుంచి మదన్మోహన్ ఝా, ఐఐపీ నుంచి ఐపీ గుప్తా, మాలే నుంచి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నుంచి రామ్‌నరేష్ పాండే ఉన్నారు.
నితీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు
“ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. మేము ప్రజలకు వాగ్దానం చేశాం. దానిని నేరవేర్చడానికి మా ప్రాణాలను అర్పించాలి. కానీ మేము వెనక్కి తగ్గం. అయితే కొన్ని బాహ్య శక్తులు బిహార్‌ను వలస రాజ్యం చేయాలని అనుకుంటున్నాయి. దానిని మేము ఎప్పటికీ అనుమతించం. బీజేపీ నీతీశ్ కుమార్‌ను ఒక కీలుబొమ్మగా మాత్రమే చేసింది. నితీశ్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని ఇప్పటికే అమిత్‌షా చెప్పారు. .. అని ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తెలిపారు.
వక్ఫ్ యాక్ట్‌ను అడ్డుకుంటాం
మహాగఠ్‌బంధన్ తమ మేనిఫెస్టోలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలకమైన హామీ ఇచ్చింది. తాము కనుక అధికారంలోకి వస్తే, అన్ని మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులు రక్షిస్తామని, రాష్ట్రంలో వక్ఫ్ (సవరణ) చట్టం అమలును అడ్డుకుంటామని పేర్కొంది. తమ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సంక్షేమ ఆధారితంగా చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు బుద్ధగయలోని బౌద్ధ దేవాలయాల నిర్వహణను బౌద్ధ సమాజ సభ్యులకే అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఇంతకు ముందు తేజస్వి యాదవ్, ‘బిహార్‌లో మహాగఠ్‌బంధన్ అధికారంలోకి వస్తే వక్ఫ్ (సవరణ) చట్టాన్ని చెత్తకుప్పలో పడేస్తామని’ చెప్పిన విషయం తెలిసిందే.


