నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు
చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలింపు
టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్ ఆధ్వర్యంలో దాడి
గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అరెస్ట్
70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టిక స్వాధీనం
లారీ సీజ్ చేసి.. కేసు నమోదు
కాకతీయ, మహబూబాబాద్ : గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమ రవాణాపై పోలీసులు కట్టడి చర్యలు చేపట్టగా భారీ సరుకు పట్టుబడింది. చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలిస్తున్న నల్లబెల్లం, పట్టికను కురవి మండలం సోమ్లా తండా వద్ద అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు కురవి శివారులోని సోమ్లా తండా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన లారీని ఆపి పరిశీలించారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టిక బయటపడటంతో వెంటనే స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఈ ఘటనలో గుగులోత్ సుమన్ , ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నల్లబెల్లాన్ని నాటు సారా తయారీ కేంద్రాలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రవాణాకు ఉపయోగించిన లారీని కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కురవి పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ సారాయి తయారీ, రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్ఐ తాహేర్ బాబా, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ జయకుమార్తో పాటు సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు. అక్రమ వ్యాపారాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.


