కరీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం
కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి
టికెట్ల కేటాయింపులో పార్టీ నిర్ణయమే ఫైనల్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే కీలక పోరుగా మారుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతామని, కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ నిర్ణయమే ఫైనల్
శుక్రవారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీజేపీ నేతల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి, 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీలో పార్టీ నిర్ణయమే అంతిమమని, పార్టీ కంటే వ్యక్తులు ఎవరూ పెద్దవాళ్లు కాదని స్పష్టం చేశారు. గతంలో ఇద్దరు ఎంపీలకే పరిమితమైన బీజేపీ నేడు వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.
కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లాను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయానికి కరీంనగర్ కార్యకర్తల పాత్ర కీలకమని, వారి సహకారంతోనే తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అన్న అంశంపై రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. మేయర్ సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కసితో పని చేయాలని పిలుపునిచ్చారు.
టికెట్ల కోసం భారీ పోటీ
ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొందని బండి సంజయ్ వెల్లడించారు. ఒక్కో డివిజన్‌కు 20 మందికిపైగా ఆశావహులు ఉన్నారని తెలిపారు. గెలిచే అవకాశమున్న డివిజన్లలో పాత కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పారు. టికెట్ల కేటాయింపు పూర్తిగా వివిధ సర్వే నివేదికల ఆధారంగానే జరుగుతుందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఖాయం కాదని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో ఐక్యంగా పనిచేస్తే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.


