నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన
30 వార్డుల్లో నామినేషన్లతో రంగంలోకి కమలం
నిజాయితీగల అభ్యర్థులకే ప్రజల ఆశీర్వాదం కావాలి
మున్సిపాలిటీ అభివృద్ధే బీజేపీ లక్ష్యం
కార్యకర్తల ఐక్యతతో ఘన విజయం సాధిస్తాం
వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, నర్సంపేట : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకున్న వేళ నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బలమైన ఉనికిని చాటింది. మొత్తం 30 వార్డుల నుంచి బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపించాలంటే నిజాయితీ, సేవాభావం కలిగిన బీజేపీ అభ్యర్థులకే ప్రజలు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, కంభంపాటి పుల్లారావు అభ్యర్థి తదితర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందజేసి, వారి వెంట నామినేషన్ల దాఖలులో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
అభివృద్ధే అజెండా
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ… నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక బీజేపీ వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు. మాటలకే పరిమితం కాకుండా, అమలు చేసే రాజకీయమే బీజేపీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, అదే అభివృద్ధి ఫలాలు స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందాలంటే మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
నిజాయితీగల పాలనకే ఓటు
బీజేపీ నాయకులు మాట్లాడుతూ… అవినీతి, అనైతిక రాజకీయాలకు నర్సంపేట ప్రజలు విసిగిపోయారని అన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో పారదర్శక పాలన తీసుకురావాలంటే నిజాయితీగల బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేసే అభ్యర్థులను బీజేపీ రంగంలోకి దింపిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నాయకత్వం సూచించింది.
ఇంటింటి ప్రచారానికి పిలుపు
రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, మున్సిపాలిటీలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహా రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రే శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, జిల్లా ఇన్చార్జీలు, పదాధికారులు, నియోజకవర్గ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


