ఇల్లందులో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
స్థానిక ఎన్నికల ముందు పావులు కదుపుతున్న అధినాయకత్వం
ఏకంగా 22 మంది మాజీ ప్రతినిధులతో సంప్రదింపులు
కాకతీయ, ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీజేపీలోకి రాజకీయ వలసలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీ లో ఇముడలేని కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్యనేతలతో బీజేపీ నేతలు మంత్రాంగం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారం, కామేపల్లి, గార్ల, టేకులపల్లి, ఇల్లందు మండలాల పరిధిలోని గ్రామాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నియోజకవర్గంలో దాదాపు 22మంది మాజీ ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. బయ్యారం మండలంలో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్,కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి లాగేందుకు సీక్రెట్ ఆపరేషన్‌ను చేపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ నాయకులు కమలం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీ లో చేరే వారి పేర్లు గోప్యంగా ఉండి బయట చెప్పేందుకు నాయకులు నిరాకరిస్తున్నారు. వాళ్లెవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలని, ఆ నాయకులు సస్పెన్స్‌ను కొనసాగిస్తుండటం గమనార్హం.


