అక్రమ అరెస్టులతో బీజేపీ ఉద్యమాలను ఆపలేరు
బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి
కాకతీయ, గీసుగొండ : అక్రమ అరెస్టులతో బీజేపీ ఉద్యమాలను ఆపలేరని, ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని మండల బీజేపీ అధ్యక్షుడు కొంగర రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనను ప్రశ్నిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎన్. రామచంద్రరావు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపును అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన కాలంలో ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 నగదు సాయం, పెళ్లైన ఆడపిల్లలకు తులం బంగారం, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం,ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు రూ.4000 భృతి, చేయూత పెన్షన్లు,గృహజ్యోతి పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ అరెస్టులు మానుకుని, ప్రజలను వంచించకుండా తక్షణమే ఆరు గ్యారంటీలను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో తమ గొంతును నొక్కలేరని,ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కొంగర రవి, ఆరకట్ల ప్రవీణ్ స్పష్టం చేశారు.


