*బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..!
*తెలంగాణపై కమల దళం ఫోకస్
*రెండు పార్టీలోని అసమ్మతి, కీలక నేతలపై దృష్టి
*క్యాడర్ కలిగిన నేతలతో త్వరలోనే మంతనాలకు యోచన
*రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్న కమలం
*కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ఇకపై రాజకీయ రణయే
*12న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్‌షా, జేపీ నడ్డా మీటింగ్‌కు ప్లాన్?
*మరో 20 రోజుల్లోపే రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య మార్పులు!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమలం పార్టీ నాయకత్వం.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు రాష్ట్రంలో పార్టీ పరమైన దూకుడు ప్రదర్శించాలనే యోచనతో ఉండటం గమనార్హం. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో జరిగిదంతా అవినీతేనని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందనే విషయాలను జనంలోకి తీసుకెళ్లాలనే పొలిటికల్ ప్లాన్‌తో ఉండటం గమనార్హం.అదే సమయంలో రెండు పార్టీల్లోని అసమ్మతి నేతలను, బలమైన క్యాడర్ కలిగి ఉండి.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం క్రమంగా కోల్పోతోందని కాషాయం పార్టీ భావిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా మెరుగవడం లేదనే అభిప్రాయంతో ఉంది. రెండు పార్టీలను బలహీన పర్చే రాజకీయ పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ఇంత కన్నా మంచి అవకాశం ఏముంటుందన్న అభిప్రాయంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణాదిలో పార్టీ పరిస్థితి కూడా చాలా మెరుగవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 2028లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు కాకతీయకు వెల్లడించారు. ఈనెల 11 లేదా 12వ తేదీన రాష్ట్ర ముఖ్య నేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా భేటీ ఉంటుందని, ఈ భేటీలోనే రాష్ట్రంలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.
కాంగ్రెస్ పై రణం.. ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి..!
రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనలో, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని పేర్కొంటూ త్వరలోనే బీజేపీ క్షేత్రస్థాయి రాజకీయ పోరాటాలకు సిద్ధం కానుందని సమాచారం. ఢిల్లీ పెద్దలతో జరిగే భేటీలో రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి దూరదృష్టి, ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్రంలో ఎరువుల సమస్య ఎదురైందని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేస్తోందని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను, పరిపాలనలోని వైఫల్యాలను, హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని ప్రజల్లో ఎండగట్టేందుకు జనం క్షేత్రంలో రాజకీయ పోరాటాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్‌పై గురి.. బీఆర్ ఎస్‌పై బాణం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రజల్లో ఎండగట్టడం.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ప్రచారం పెంచడం, గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజల్లో చర్చ పెట్టడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా మార్చగలమనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందని సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా గురి పెడుతూనే.. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను తమ వైపునకు తిప్పుకోవాలనే వ్యూహాత్మక వైఖరిని అవలంభించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
కాంగ్రెస్‌పై గురి పెడుతూనే.. బీఆర్ఎస్‌పై బాణం వేయాలని చూస్తోంది. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈవిషయంలో మార్గనిర్దేశం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు రాచందర్‌రావు జిల్లాల్లో పర్యటనలకు శ్రీకారం చుడుతూ.. క్యాడర్‌ను ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సన్నద్ధం చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం పెద్దలకు సైతం విషయాలను వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కారు పార్టీలో కంగారు..!
కేసీఆర్ తనయ కవిత మాజీమంత్రి హరీష్‌రావు, సంతోష్‌రావులపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. తీవ్రంగా స్పందించిన కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనేలా చేస్తోంది. కవిత వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కవిత కామెంట్స్‌పై ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ చెప్పారు. రాజకీయ విబేధాలు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్‌రావులను రాష్ట్ర ప్రభుత్వం దోషులుగా పేర్కొంటూ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థకు వెళ్లడంతో.. కాస్త కారు పార్టీలోనూ కంగారు మొదలైంది. కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేల్లో కొంతమంది నేతలు బీజేపీ నేతలకు అప్పుడే టచ్‌లోకి వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నాయకత్వాన్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు ఆ పార్టీ ముందున్న సవాల్‌గా మారిందనే చెప్పాలి. మరో 20 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య మార్పులు రాబోతున్నాయంటూ ఓ బీజేపీ ముఖ్యనేత కాకతీయతో వ్యాఖ్యనించడం గమనార్హం. భారీగా చేరికలుంటాయి.. బాజాప్తా అధికారంలోకి వస్తాం.. మీరే చూస్తారంటూ ధీమా వ్యక్తం చేయడం విశేషం.


