హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి
మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసి బీజేపీ శక్తిని చాటాలని ఆయన కోరారు. సోమవారం హుజురాబాద్ మున్సిపాలిటీ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. గడచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు సరైన నిధులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమవుతున్నాయని, ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణ రూపురేఖలను మార్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో హుజురాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రజలను ఆయన కోరారు.


