కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిని బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 22 నెలల పాటు ఆలస్యం జరిగిందని, చివరికి బీజేపీ సూచించిన మార్గాన్ని అనుసరించి బిల్లు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై నిజాయితీగా ఉంటే, మొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కి పంపించి ఉండాల్సి ఉందని రాంచందర్ రావు అన్నారు. కానీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో బీసీలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ అసలైన ద్రోహ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవడం వల్ల 73వ, 74వ సవరణల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.3,000 కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా పోయాయని ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ వైఫల్యం కారణంగా రాష్ట్రానికి జరిగిన పెద్ద నష్టం అని అన్నారు.
ఇక బీసీల పట్ల బీజేపీ కట్టుబాటు ఉన్నదని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీలను చేర్చడం, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇవ్వడం వంటి నిర్ణయాలు దీనికి నిదర్శనమని రాంచందర్ రావు గుర్తుచేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తమ కేబినెట్‌లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. బీసీల హక్కులను కాపాడాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.
అదే సమయంలో, ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని రాంచందర్ రావు చెప్పారు.


