ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..
హీటెక్కిన బీహార్ పాలిటిక్స్!
బీహార్ ఎన్డీయేలో అంతర్గత యుద్ధం
స్పీకర్ పీఠంపై ఏర్పడిన క్లిష్ట పరిస్థితి
ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు
కాకతీయ, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. అఖండ మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూటమి వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఘనంగా కనిపించినా, ప్రభుత్వ నిర్మాణం నేపథ్యంలో కూటమిలో రాజకీయ లెక్కలు, శక్తి ప్రదర్శనలు మొదలయ్యాయి. నితీశ్ కుమార్ నాయకత్వాన్ని బీజేపీ అంగీకరించినా… కీలక పదవులు, మంత్రిత్వ శాఖల పంపకంలో రాజకీయ ఆధిపత్య యుద్ధం స్పష్టంగా కనిపిస్తోంది.
కొత్త మంత్రివర్గ కూర్పుపై బీజేపీ–జేడీయూ మధ్య అంతర్గత చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. ఏ పార్టీకి ఏ శాఖ ఇవ్వాలి? ఎవరు మంత్రులు కావాలి? అన్న విషయాలపై ఇప్పటికే ఫార్ములా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్‌డిఎలో సంఖ్యాబలం బీజేపీకే ఎక్కువ. కానీ సీఎం కుర్చీ జేడీయూకి వెళ్లడంతో స్పీకర్ పదవిని ఖచ్చితంగా తమకే బీజేపీ పట్టుపడుతోందట. గత అసెంబ్లీలో స్పీకర్‌గా బీజేపీకి చెందిన నంద కిశోర్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ పనిచేశారు. ఈసారి కూడా అదే ఫార్ములాను కొనసాగించాలనేది బీజేపీ భావిస్తోంది. అయితే ఈసారి స్పీకర్ పదవి తమకే రావాలి అని పట్టుబడుతోంది జేడీయూ. దీంతో స్పీకర్ సీటు కోసం ఇరు పార్టీల మధ్య భారీ ఫైట్ నెలకొంది.
ఈ వివాదం పరిష్కారం కోసం జేడీయూ నేత నితీశ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ టాప్ లీడర్లతో కీలక చర్చలు జరపనున్నారు. మంత్రివర్గంలో ఏ శాఖ ఎవరికన్న దానికంటే.. ఈ సమావేశంలో స్పీకర్ పోస్టే ప్రధాన చర్చ అంశం కానున్నట్లు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. జేడీయూ సీనియర్ నాయకులు సంజయ్ కుమార్ ఝా, లాలన్ సింగ్ సహా పలువురు ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణం అయ్యారు. స్పీకర్ సీటు కోసం బీజేపీపై ఒత్తిడి చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.
బీహార్ శాసనసభలో కీలక పదవి కావడంతో బీజేపీ కూడా గట్టి పట్టు మీద ఉంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు పాట్నాలో అర్థరాత్రి వరకు వ్యూహాత్మక చర్చలు జరిపారట. స్పీకర్ పదవితో పాటు ప్రముఖ శాఖలను కూడా ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కేంద్రాధికారులకు తెలియజేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్పీకర్ పదవిపై నెలకొన్న పవర్ గేమ్, లాబీయింగ్, టెన్షన్ బీహార్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. ఎలాగైనా నవంబర్ 20 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది ఎన్డీయే లక్ష్యం. అయితే స్పీకర్ పీఠంపై బీజేపీ–జేడీయూ మధ్య ఎవరి మాట నిలుస్తుందో చూడాలి.


