- ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజల చైతన్యం అవసరం
- మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ, సంతకాల సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని అన్నారు. ఓటు దోపిడీ అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ ప్రజల ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల కమిషన్ బదులు రాహుల్ గాంధీపై విచారణలు జరపడం దురదృష్టకరమని అన్నారు. “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్” నినాదాలతో ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నామని, ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రజల ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను ఎక్కించి ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటు నమోదు అయిందా లేదా చూడాలని సూచించారు. చండీగఢ్‌లో పని చేసే హైదరాబాద్‌కి చెందిన ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనపై కూడా ఆయన స్పందిస్తూ ఆ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, ఆయన భార్య ఐఏఎస్ అధికారి, భర్త మృతదేహంతో ధర్నా చేస్తుందని తెలిపారు. హుస్నాబాద్ ప్రజలందరూ ఓటు చోరీ వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.


