హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ
కాకతీయ, హుజూరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఎదిగి అతి చిన్న వయసులో జాతీయ అధ్యక్ష పదవిని దక్కించుకోవడం చారిత్రక ఘట్టమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా హుజూరాబాద్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించి భారీ వాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 45 ఏళ్ల వయసులోనే పార్టీ చరిత్రలో అతి చిన్న వయస్కుడిగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం యువ నాయకత్వానికి దక్కిన గొప్ప గుర్తింపని తెలిపారు. నితిన్ నబీన్ బీహార్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసి పరిపాలనలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో నిస్వార్థంగా సేవలందించిన నితిన్ నబీన్‌కు జాతీయ అధ్యక్ష బాధ్యతలు రావడం ద్వారా క్రియాశీల కార్యకర్తలకు పెద్ద అవకాశాలు ఉన్నాయనే సంకేతం స్పష్టమైందన్నారు. ఆయన మార్గనిర్దేశనలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ ఎర్రం మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


