నర్సంపేటలో బీజేపీ ప్రచార హోరు
రాణా ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో శ్రేణుల దూకుడు
విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం ఊపందుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అభ్యర్థులతో కలిసి ఆయన వివిధ వార్డుల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల గ్యాస్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని చెప్పారు. నర్సంపేట అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. యువత, మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని నేతలు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రాణా ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


