1వ డివిజన్‌లో బీజేపీ ప్రచార జోరు
బండి సంజయ్ ప్రచారంతో మారిన సమీకరణాలు
మానిఫెస్టోతో అపర్ణ–జితేందర్ దూకుడు
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ 1వ డివిజన్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురువారం అరెపల్లి ప్రాంతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచారం డివిజన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంజయ్ ప్రచారం అనంతరం బీజేపీ శ్రేణులు మరింత దూకుడుగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అభ్యర్థులు బారి అపర్ణ, జితేందర్ మానిఫెస్టోనే ప్రధాన ఆయుధంగా చేసుకుని ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చేసిన అభివృద్ధి పనులు, కొనసాగుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి అంశాలను మానిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. మహిళలు, యువత, పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిస్తామని ఇచ్చిన హామీలు ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బండి సంజయ్ రాకతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రచారంలో సమన్వయం, వేగం పెరగడంతో 1వ డివిజన్‌లో పోరు మరింత ఉత్కంఠగా మారుతోంది. మానిఫెస్టో ఆధారిత ఈ ప్రచారం ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతుందన్నదే ప్రస్తుతం ప్రధాన రాజకీయ చర్చగా మారింది.



