కాకతీయ, బయ్యారం: రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ చేసినట్టు సుప్రీం కోర్టు తీర్పుతో రుజువైందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్ అన్నారు. శుక్రవారం గణేష్ మాట్లాడుతూ.. బీహార్ లో 65 లక్షల తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని,వాటిని తొలగించడానికి గల కారణాలను తెలియజేయాలని, దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ ఓటు చోరీ చేస్తున్న విషయాన్నీ మన కాంగ్రెస్ నాయకులు వెలికి తీసి ప్రజల ముందు పెట్టారన్నారు.
ఇది దేశ ప్రజల హక్కులపై దాడనీ అన్నారు. ఇది రాజ్యాంగంపై దాడని, బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, నియంతృత్వాన్ని పెంచుకోవాలని చూస్తోందనీ,ఓటు హక్కు కోసం అడిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చెయ్యడం ప్రజాస్వామ్యంలో సహించరాని నేరమని అన్నారు. దేశంలో ప్రతిపక్షాన్ని అణగదొక్కి ప్రజల స్వరాన్ని మూయాలన్న బీజేపీ కుట్రలు ఎప్పటికీ సఫలం కావని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రాజ్యాంగం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతుందని తెలిపారు.
ఓటు హక్కును కాపాడటమే నిజమైన దేశభక్తి అని,ఈ పోరాటం రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానుందని హెచ్చరించారు.సత్యాన్ని ఎప్పటికీ అణచలేరని, సత్యం ఎప్పటికీ గెలుస్తుందనీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదని, ప్రజల ఓటు హక్కు కాపాడే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.


