అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్
కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు
రహస్య పొత్తుతో ప్రజలను మోసం చేశారు
మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి అడ్డాగా మార్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ప్రకటించడంతో ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు 70 శాతానికి పైగా గెలిచారని గుర్తు చేశారు.
బీజేపీ–బీఆర్ఎస్ రహస్య పొత్తు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రహస్య పొత్తు ఉందని ఆరోపించారు. గత ఎన్నికల్లో 30 శాతానికి మించని ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో 10 శాతానికే పరిమితం అవుతాయని వ్యాఖ్యానించారు. పార్టీల మార్పులతో అవినీతి రూపం మారుతుందే తప్ప తీరులో మార్పు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. డంపింగ్ యార్డు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు వెలిచాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


