కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం
ఎమ్మెల్యే నివాసంపై దాడికి ఖండన
కిషన్ రెడ్డి అరెస్ట్ యత్నంపై తీవ్ర నిరసన
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలను కూడా తీవ్రంగా నిరసించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరమని నాయకులు పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం లేదని స్పష్టం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దుర్వ్యవహారాన్ని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, నరసయ్య, కనకయ్య, చొప్పదండి శ్రీనివాస్, దేవరాజ్, వెంకటేష్, కోడం రవి, ఆంకారపు రాజు తదితరులు పాల్గొన్నారు.


