బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం
మరో నిందితుడు పరారీలో..
అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. ఈనెల 2వ తేదీ రాత్రి గజ్వేల్ పట్టణంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పురంశెట్టి ప్రవీణ్ కుమార్ తన పల్సర్ బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేయగా, మరుసటి రోజు ఉదయం అది కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 107/26 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించిన పోలీసులు వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూరుగుపల్లి స్వామి, బూరుగుపల్లి మల్లేష్‌ను అనుమానితులుగా గుర్తించారు. సోమవారం ఉదయం పిడ్చేడ్ వైపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సమీపానికి పల్సర్ బైక్‌పై వస్తుండగా వారిని పోలీసులు ఆపగా మల్లేష్ పరారయ్యాడు. స్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా పల్సర్ బైక్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన మరో 7 బైకుల వివరాలను వెల్లడించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పల్సర్, రెండు ప్యాషన్ ప్లస్ బైకులు ఉన్నాయి. అలాగే గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ప్యాషన్ ప్లస్, మెదక్ టౌన్ పరిధిలో ఒక ప్యాషన్ ప్లస్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీవీఎస్ ఎక్స్ఎల్, చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్యాషన్ ప్లస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు మాట్లాడుతూ.. పాత మోటార్ సైకిళ్ల లాక్ సెట్లు అరిగిపోవడం వల్ల ఇతర తాళాలతో సులభంగా తెరుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు తావు లేకుండా పాత వాహనాలకు కొత్త లాక్ సెట్లు వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన గజ్వేల్ ఎస్హెచ్ఓ వి. రవి కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్సైలు ప్రేమ్ దీప్ తదితర క్రైమ్ సిబ్బందిని ఏసీపీ నరసింహులు అభినందించారు.


