- గంగాధర వద్ద ఘటన

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాలలోకి వెళితే.. అక్టోబర్ 21, ఉదయం సుమారు 7.30 ప్రాంతంలో గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామానికి చెందిన తొర్రికొండ మల్లయ్య అలియాస్ రాజమల్లు (55) కరీంనగర్ నుండి తన భార్య, మేనత్తతో కలిసి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు. అయితే కొండన్నపల్లి శివారులోకి రాగానే జగిత్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం కారును వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టింది. ఆ బైక్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్ షా (30) నడుపుతున్నట్లు గుర్తించారు. బలంగా ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న మల్లయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైకిస్టు ఇమ్రాన్ షా కూడా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


