కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంపై నజర్ పెట్టింది. ఆ తర్వాత మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని కమల పార్టీ భావిస్తోంది. దీర్ఘకాలంగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండటంతో రాష్ట్రంలో సహజంగా నెలకున్న వ్యతిరేకత కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది. గతవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ముగించేందుకు ఆయన సూచనలు చేశారు.
పార్టీ సీనియర్ నాయకత్వంలో అభిప్రాయబేధాలు నెలకున్నాయి. గతంలో ఉన్నా ఎన్నికల ముందు అవి సర్దుమనిగేవి. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఉన్నప్పుడు ఎన్నికల వేళ ఆయన మాటను అంతా ఆమోదించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం వారి వ్యక్తిగత అజెండాతో నడుస్తోందని ఓ సీనియర్ నాయకుడు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.
ఇక సీట్ల పంపకంపై జేడీయూ స్పష్టమైన అజెండాతో ముందుకు వస్తోంది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కంటే కనీసం ఒక సీటు ఎక్కువ రావాలని డిమాండ్ చేస్తోంది. తమ రాజకీయ బలం, ‘సీనియర్ పార్ట్నర్’ ఇమేజ్ దృష్ట్యా ఇది న్యాయసమ్మతమని జేడీయూ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ ఈ డిమాండ్‌ను అంగీకరించడానికి ఇష్టపడకపోవడం వల్ల చర్చలు స్తబ్ధతలో పడ్డాయి. మరోవైపు, లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్ పస్వాన్ నేతృత్వంలో) కూడా ఎక్కువ సీట్లు కావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో ఎన్డీఏలో భాగస్వాముల మధ్య సీట్ల చర్చలు మరింత క్లిష్టంగా మారాయి.
సీట్ల లెక్కలో బీజేపీ ప్రధాన పార్టీ అయినప్పటికీ, మిత్రపక్షాల ఒత్తిడి వల్ల తుది నిర్ణయం ఆలస్యం అవుతోంది. జేడీయూ, ఎల్‌జేపీ డిమాండ్లకు బీజేపీ ఎలా ప్రతిస్పందిస్తుందన్నదే రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏ సమీకరణలకు కీలకం కానుంది. అంతర్గత పోట్లను తగ్గించి, సీట్ల పంపకంపై స్పష్టత తీసుకురాకపోతే, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ బలహీనమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీజేపీ, ముందుగా రాష్ట్ర నాయకుల మధ్య ఐక్యతను తీసుకువచ్చి, ఆ తర్వాతే సీట్ల పంపకంపై స్పష్టమైన ఫార్ములా ప్రకటించాలని వ్యూహం వేసుకుంటోంది.


