కాకతీయ, నేషనల్ డెస్క్: బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం అర్హులైన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తుది జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 3.8 శాతం తగ్గి 15.5 లక్షలు తగ్గగా, మహిళా ఓటర్ల సంఖ్య 6.1 శాతం తగ్గి 22.7 లక్షలు తగ్గింది. అంటే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించారు. ఈ పరిస్థితి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిహార్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారు.
మహిళా ఓటర్ల తొలగింపులో గోపాల్‌గంజ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 15.1 శాతం అంటే 1.5 లక్షల మహిళలు జాబితా నుంచి తొలగించారు. జనవరిలో ఇక్కడ మహిళా ఓటర్లు 10.3 లక్షలుగా ఉండగా, తుది జాబితాలో 8.3 లక్షలకు తగ్గారు. రెండో స్థానంలో మధుబని జిల్లా (1.3 లక్షలు), మూడో స్థానంలో పూర్వి చంపారన్ (1.1 లక్షలు) ఉన్నాయి. అలాగే సారణ్, భగల్‌పూర్ జిల్లాల్లో కూడా ఒక్కో లక్ష మహిళలు జాబితా నుంచి తొలగించబడ్డారు. ఆసక్తికరంగా ఈ జిల్లాలు అన్నీ పొరుగు రాష్ట్రాలు లేదా దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి.
పురుష ఓటర్లలో కూడా తొలగింపులు జరిగాయి కానీ సంఖ్య మహిళలతో పోలిస్తే తక్కువ. మధుబని జిల్లాలో 95,000 పురుషులు, పాట్నాలో 90,000, సారణ్‌లో 86,000, పూర్వ చంపరన్‌లో 85,000, గోపాల్‌గంజ్‌లో 80,000 మంది పురుష ఓటర్లు జాబితా నుంచి తొలగించారు. మహిళా, పురుష ఓటర్లు ఎక్కువగా తొలగించబడిన ఆరు జిల్లాలు ఉన్నాయి. అవి గోపాల్‌గంజ్, మధుబని, పూర్వి చంపరన్, సారణ్, భగల్‌పూర్, పాట్నా. వీటిలో మొత్తం 59 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో మహాఘట్‌బంధన్ 25 సీట్లు, ఎన్డీయే 34 సీట్లు గెలుచుకున్నాయి.
అయితే గతంలో ఈ నియోజకవర్గాల్లో ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు, సీఎస్‌డీఎస్ సర్వే ప్రకారం 38% మహిళలు ఎన్డీయేకు, 37% మహిళలు మహాఘట్‌బంధన్‌కు ఓటు వేశారు. ఇక పురుష ఓటర్లలో 36% ఎన్డీయేకు, 38% మహాఘట్‌బంధన్‌కు మద్దతిచ్చారు. అంటే కేవలం 11,500 ఓట్ల తేడాతో ఎన్డీయే ఆధిక్యం సాధించింది.ఇప్పుడు లక్షలాదిమంది మహిళా ఓటర్లను తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో గణనీయమైన మార్పు రావచ్చని భావిస్తున్నారు.
మహిళల ఓటు కీలకమని గుర్తించిన ప్రధాన పార్టీలు ఇప్పటికే వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బిహార్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద 75 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. ఇది మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందేమో చూడాలి.


