భూపాలపల్లిలో పెద్దపులి కలకలం
ఎద్దును చంపి వంద మీటర్లు లాకెళ్లిన వన్యప్రాణి
చిట్యాల మండలంలో భయాందోళనలో జనం
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చిట్యాల మండలం జడలపేట గ్రామ శివారులో ఓ ఎద్దును వన్యప్రాణి దాడి చేసి హతమార్చి సుమారు 100 మీటర్ల దూరం వరకు లాకెళ్లిన ఘటన స్థానికంగా భయాందోళనలకు దారి తీసింది. ఉదయం గ్రామస్థులు ఈ దృశ్యాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో జడలపేటతో పాటు గాంధీనగర్, భీష్మనగర్, రామచంద్రపూర్ గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువుల కాపరులు, రైతులు పొలాలకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని గ్రామస్థులు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎద్దు మరణానికి పెద్దపులి దాడే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన పాదముద్రలను అధికారులు పరిశీలించగా, అవి పెద్దపులివేనని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలని సూచన
పెద్దపులి సంచారం ఉన్నట్లు అనుమానంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పశువులను కాపాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. పెద్దపులి కదలికలపై నిఘా పెంచామని, అవసరమైతే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.


