చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!
మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో చేరిక
కాంగ్రెస్ కండువా కప్పుకున్న 50 కుటుంబాలు
కాంగ్రెస్‌లో చేరికలతో మండలంలో రాజకీయ సమీకరణాల మార్పు
అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి స్పష్టీకరణ
కాకతీయ, నర్సంపేట : చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మండలానికి చెందిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ కంది శ్వేత, కంది కృష్ణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ విజయరామరాజు, మండల నాయకుడు జున్నుతుల మహేందర్ రెడ్డి, అడుప అశోక్, సాంబయ్య తదితరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సుమారు 50 కుటుంబాలు ఒకేసారి పార్టీ మారడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెన్నారావుపేట మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కంది కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామానికి మరింత అభివృద్ధి సాధ్యమని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సిద్దన రమేష్, మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రాములు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నారావుపేటలో తాజా చేరికలతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది.


