సొంత గూటికి భీమగోని సురేష్
హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌కు బలం పెంచిన చేరిక
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్, ముఖ్య నాయకుడు భీమగోని సురేష్ తిరిగి తన సొంత పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్‌లో చేరికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించడం లేదన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలులో విఫలమయ్యాయని ఆరోపించారు. రైతులు, పేదలు, మహిళలు, యువత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు ప్రజలు గట్టిగా మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించిందని గుర్తు చేశారు. పార్టీలో చేరిన భీమగోని సురేష్ మాట్లాడుతూ… బిఆర్ఎస్‌తోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


