దివ్యాంగ పిల్లల అభివృద్ధికి భవిత కేంద్రాలు కీలకం
కలెక్టర్ పమేలా సత్పతి
మహాత్మా నగర్ భవిత కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన కొత్త భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు మానసిక, విద్యా పరంగా గణనీయమైన మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే ఈ కేంద్రాల్లో చేరితే, వారు స్వతంత్రంగా పనులు చేసుకునే స్థాయికి ఎదుగుతారని చెప్పారు.జిల్లాలో జరుగుతున్న ‘దివ్య దృష్టి’ కార్యక్రమం ద్వారా అంధుల, బధిరుల పాఠశాలలు మరియు భవిత కేంద్రాల అభివృద్ధి వేగవంతమైందని కలెక్టర్ వివరించారు. సైగల భాషను అధికారులకు, పాఠశాలలు, ఆసుపత్రుల సిబ్బందికి నేర్పించడం వల్ల బధిరుల అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సేవలను ఆమె అభినందించారు.అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ, దివ్యాంగుల విద్య, అభివృద్ధి కోసం జిల్లాలో మరెన్నో కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు. భవిత కేంద్రాలు, దివ్యాంగుల పాఠశాలల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో మల్హోత్ర, కో ఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్, డిఈ కృష్ణ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో బుధవారం బోధనను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ పమేలా సత్పతి మహాత్మా నగర్ జెడ్‌పీ హై స్కూల్‌లో బుధవారం బోధన కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించి, వారి నేర్చుకునే స్థాయిని పరీక్షించారు. కొందరు విద్యార్థులు పాఠాలను సరిగా చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.విద్యార్థులు ప్రతిరోజూ పాఠాలను బిగ్గరగా చదవాలని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ప్రతి విద్యార్థి బుధవారం బోధనలో తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.


