భద్రకాళి తీరాన భాస్కరుడికి నీరాజనం
భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు
సామూహిక సూర్య నమస్కారాలతో ఆధ్యాత్మిక శోభ
కాకతీయ, వరంగల్ సిటీ : మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రక భద్రకాళి బండ్ ఆదివారం ఉదయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్య భగవానుని జయంతి సందర్భంగా నగరవాసులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భాస్కరుడికి ఘనంగా నీరాజనాలు అర్పించారు. భానుడు ఉదయించగానే లేత కిరణాల సాక్షిగా భద్రకాళి తీరాన సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఓంకార నాదంతో పరిసరాలు మార్మోగగా, యోగా సాధకుల సమూహ సాధన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యోగా గురువు యోగా కుమార్ గురూజీ మాట్లాడుతూ… సూర్యుడే సమస్త జీవరాశికి ప్రాణదాత అని పేర్కొన్నారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆరాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. వేదాలు పేర్కొన్న “ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అనే వాక్యం సూర్యారాధన ప్రాముఖ్యతను చాటుతుందని వివరించారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, విటమిన్–డి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, స్థానిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


