ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త
పండగ ఆఫర్ల పేరిట కేటుగాళ్లు
అప్రమత్తతతోనే స్వీయ ఆర్థిక రక్షణ
జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం సూచించారు.ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారు.
ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి, రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. మోసగాళ్లు నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షిస్తారన్నారు. వాట్సాప్, ఎస్ ఎమ్ ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం చేస్తారన్నారు. గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ధృవీకరించిన వెబ్‌సైట్లు ,అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయాలని ఎస్పీ సూచించారు. టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని తెలిపారు. ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని సూచించారు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించాలన్నారు.
ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ తెలిపారు.


